చివరి ప్రయాణంలో...!!

జీవన ప్రయాణం కొంతవరకే
ఆగిపోతుంది 
మనదేది లేకుండా చేస్తూ
మృత్యువు వెంట తీసుకెళ్తుంది
నిన్న,నేడు,రేపు అనేది మన ఆధీనంలో ఉండదు
అలాంటిది ఈ పుట్టుక మరణం ఎంత?
కాలగర్భంలో కలిసిపోక తప్పదు
జీవన గమనం గమ్యం తెలుసుకుని
మృత్యువు అధరాన్ని తాకినప్పుడు
జీవితం స్పష్టం అవుతుంది
అలా తెలుసుకోలేనంత వరకు ఈ పుట్టుక వ్యర్థమే!
కాలప్రవాహంలో గతించే
కిందపడిపోయి చీకటయ్యే 
గాలివాటు క్షణాల ముందు
ఇదెంత బతుకు
ఇదెంత బతుకు!
ఏది లేదు
ఏది రాదు
నీకంటూ ఒక మృత్యువు ఉంది
అదే నిజం
అది నీడలా నీ వెంటే వస్తుంది
నీకే తెలియకుండా అది సమీపిస్తుంది!
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు
కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలే
బతికే తీరు మాత్రమే నిజం 
ఆ నిజంలోనే బతకాలి
కాలం మనకంటే వేగం
ఈరోజే కాదు 
రేపు అనే భవిష్యత్ కూడా 
కాలం అనే దోసిళ్ళ నుండి
దొర్లిపోతుంది
అస్పష్టంగా మనకే తెలియకుండా
ఒలికిపోయిన మరకలను అంటించుకుని మరి వెళ్ళిపోతుంది!
నీ కళ్ళల్లో నీళ్ళు తిరగడం
కొన్ని జ్ఞాపకపు తునకలు మిగిలి
కారిపోతున్న ఆ కన్నీళ్ళ సాక్షిగా
ఈ ఒక్కరోజే కాదు
సమాధి చేయబడని నీ భాధ
నువ్వు బ్రతికున్నంత వరకు 
నిన్ను బ్రతకనివ్వదు
కానీ నువ్వు బ్రతికే ఉన్నావనే భ్రమలో మాత్రం ఉంచుతుంది!
ఈ శరీరం శాశ్వతం కాదు
ఇది ఎముకల గూడుకి ఒక తొడుగు మాత్రమే
ప్రాణం ఉన్నన్ని రోజులు ఉంటుంది
ప్రాణం పోయాక మట్టిలో కలుస్తుంది
కానీ శాశ్వతంగా నిలిచే బతుకు ఒకటుంది
మనిషి పుట్టుక నుండి మరణం దాకా
మద్యలో సాగించే ప్రయాణమే ఈ జీవితం
జన్మించడం మరణించడం తేలిక
కానీ జీవించడం మాత్రం అంత సులభమేమి కాదు
అది నిరంతర ఘర్షణలతో కూడిన సంఘర్షణ కదా!

Miss You బాపు 😭😭

- Kallem Naveen Reddy

Comments

Post a Comment

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!