రెప్పపాటు జీవితం...!!!

కనిపించేది
నేను కాదు
కేవలం శరీరమే!

నా ఆలోచనలే నావి
మిగతావేవి నావి కావు
అవన్నీ స్వల్పమే!

నేనిక్కడ కొన్నాళ్లపాటే 
ప్రయాణం చేస్తాను
ఒకరోజు ఆ ప్రయాణం ఆగిపోతుంది
మనకే తెలియకుండా
మన కథ ముగుస్తుంది
ఇంతమాత్రానికి
నేనెందుకు అహం ఇహం అంటూ బతకాలి 
అందుకే నాలా నేను జీవిస్తాను!

ఒకరోజు ఈ దేహాలన్నీ 
ఊరు చివరన చేరబడతాయి
ఈ పలికే మాటలన్నీ 
ఒకరోజు మూగబోతాయి
నీదని నాదని 
విర్రవీగి బతికిన దేహాలు
దాహానికి దూరం అవుతాయి
అవును ఇక్కడెన్నో దేహాలు
పాతిపెట్టబడ్డాయి
చరిత్ర పుటల్లో దాగిన సత్యాలను చూపిస్తూ....!

అశాశ్వతమైన ఈ జీవన కాలగమనంలో 
అస్పష్టంగా ఒకరోజు అన్నీ అక్కడే
ఊరిచివరన తలదాచుకుంటాయి!

అర్థరహిత ఉనికిది ఈ దేహం
దానికి నిర్వచనాలతో పనేముంది?
శ్వాసనిశ్వాసలు విఛ్ఛిన్నమౌతూ
ప్రాణం నీ నుండి దూరం అవుతున్న సమయంలో
నీ ఆత్మకు సమాధి నీ దేహం మాత్రమే
అలాంటిది ఆ దేహానికి నిర్వచనాలతో పనేముంది?

మనసనే ఒక ఉద్వేగాన్ని అర్దం చేసుకోక
ఆప్యాయతల, అనురాగాలను తుడిపేసి
ఇంత కాలాన్నీ గడిపావు కదా
నీ ఆలోచనలకు జీవిత ఆంతర్యం ఏంటో
అర్దం కాలేదా?
ఈ కనిపిస్తున్న దేహం
ఒకరోజు కనుమరుగవుతుందని
తెలియలేదా?

రెప్పపాటు జీవితమే 
మనది అయినప్పుడు
జననం యాదృచ్చికం 
మరణం అనివార్యం అయినప్పుడు
శాశ్వతంగా మన ఉనికి 
నిలిచే విధంగానే బతకాలి కదా....!!

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!