పిట్టకెట్టుడు!
అవును బలగం సినిమాలో తెలంగాణా ప్రాంతీయత మాత్రమే వుంది. మనిషి యొక్క ఉద్వేగాలను వున్నదున్నట్లు చూపడం ఈ సినిమా గొప్పదనం. ప్రేమని కేవలం మనుషుల చుట్టూరా తిప్పుతూ సహజంగా చూపడమే ఈ కథ చేసింది. ఇందులో ఎన్నో విలువలు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో లాగా బూతు డైలాగులతో తాత్కాలిక మెప్పు కోసమో, సగం డ్రెస్సులు వేసుకుని అంగాంగా ప్రదర్శనలు చేసే సినిమాల్లో లాగా ఏ ఒక్క సీన్ లేని మనిషి బతుకు అంతరంగాన్ని పరిచిన తెలంగాణ పల్లె జీవన చిత్రం ఈ బలగం. ఇందులో సహజమైన తెలంగాణా గ్రామ జీవితం వుంది. సినిమా చూసిన తర్వాత మిగిలేవి మనుషుల మధ్య బంధాల ఆప్యాయతలు, ప్రేమలు మాత్రమే!
ఏవి మనతో శాశ్వతంగా రాని ఆస్తుల కోసం,అహం కోసం,స్వార్థం కోసం ఒకే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళ మధ్యలో ఈ కోప తాపాలు, మనస్పర్థలు అనేవి నీటి బుడగలతో సమానం. మరణం ముందు అందరూ ఓడిపోతారు కానీ ఇలాంటి ప్రేమల ముందు ఓడిపోకూడదు. ఇందులో ఆ కాకి నేర్పిన పాఠం చాలా గొప్పది. అందరూ కలిసి బంధం విలువ తెలుసుకుని ఒక్కటై బాధపడటం అందులో మనం గమనించవచ్చు. అప్పుడే కాకికి పెట్టింది ముడుతుంది. ఆ తాత ఆత్మ శాంతించి బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు వికసించాయి. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు కానీ మధ్యలో మనం జీవించే విధానంలో ఎన్నో బంధాల మధ్య అనేక విలువలు కలిగి ప్రయాణం జరుగుతుంది. అందులో కొన్ని బంధాలు ఎంతో భాదిస్తాయి. ఆ భాదించే బంధాలను సైతం ఈ బలగం కళ్ళు తెరిపించింది. బంధాల విలువ తెలిపింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కంట తడి పెట్టించింది!
తెలంగాణ వస్తే ఏమొచ్చింది అంటే మన యాస మన బాస బతికింది అని చెప్పడానికి ఇలాంటి సినిమాలే నిదర్శనం!
-------------------------------------------------------------------------
కళ్ళు తెరిస్తే జననం,కళ్ళు మూస్తే మరణం
రెప్పపాటు జీవితానికి ఎన్ని ఆశలు,ఎన్ని ఆరాటాలు..
ఒక్కో సారి బతుకంత భ్రమలో గడుపుతున్న తెలియని పిచ్చితనంలో చావు నుండి పుట్టుక దాకా ఎన్ని ఎదురు దెబ్బలో..... బాధలు నీవే,బాధ్యతలు నీవే.. అయిన కూడ
కన్నీటి ఉప్పెన అంత కడుపులో దాచుకొని సాగాలి
నీ జీవన పయనం తీరం చేరే దాకా..!!
-------------------------------------------------------------------------
@@@ ఆ ప్రయాణంలో కొన్ని నా భావాలు పంచుకుంటున్నాను....!
-------------------------------------------------------------------------
మనిషి పుట్టుక నుండి
మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం
చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే
చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే!
ఓరయ్య
వినుకోరా
మనం చనిపోయాక
ముట్టుడంటారు
ముక్కు మూసుకుంటారు
కాల్చేస్తారు
పూడ్చేస్తారు
మనదేది లేకుండా చేసి
అన్ని తగులబెడతారు
కానీ
మరణం లేనిది
తగులబెట్టలేనిది
ఒకటుంది రా అయ్యా
అదే శాశ్వతమైన "పేరు"
ఇది కేవలం వ్యక్తిత్వం పైననే
అతని తత్వం పైననే
ఆధారపడి ఉంటుందిరా అయ్యా
ఇది మరిచావా!?
ఎవరు తోపు కాదురా అయ్యా
స్మశానం అనే శాశ్వతమైన ఇల్లోటి ఒకటుంది!
ఇది గుర్తుందా?
రాజులు
రాజ్యాలు
అన్ని పోయాయి!
ఏది మిగలకుండా!
గతం కదా
జ్ఞాపకాలే బతికుంటాయి
మంచిచేస్తే
వ్యక్తిత్వం అనేది
మరణం లేకుండా.....!
అవును
ఇది
మరిచే ఉంటావులే
వర్తమానం బతుకులు కదా
ఇలాగే అశాశ్వతమైన ఆలోచనలతో
అర్దం లేని వ్యక్తిత్వాలతో కూడి
అంతరించిపోతావు
చరిత్ర లేకుండా!
బతుకంటే
కేవలం బతకడమే కాదు
జీవించడం!
చరిత్ర సృష్టించడం!
సచ్చాక కూడా
బతకడం!
ఇదర్థం కాదులే........!?
జీవితంలో డబ్బు కోసమే బతుకుతూ
పక్కవారిని మోసం చేస్తూ
మంచివారిని కూడా చెడ్డవారిలాగా చిత్రీకరించి
బురదలో బతుకుతున్న పందుల్లాంటి వారే చుట్టూ చేరి నవ్వుల పాలు అవుతున్నారు
కొందరు వెర్రి జనాలు
కొన్ని వెర్రి బంధాలు!
చీకటయ్యే రోజు వచ్చినప్పుడు
ఆరడుల జాగదగ్గర
అవసరానికి మించి సంపాదించిన ఆస్తులు
అవేమీ నీవెంట రాకుండా
ఆశాశ్వతమై ఇక్కడే ఉంటాయి!
అవును ఒకరోజు
ఏకాంతంగా నిశబ్ద మందిరంలో
ఎన్నో తగాదాలు
ఎన్నో పగలు
ఎన్నో ద్వేషాలు
అర్దం లేనివన్నీ
శరీరంతో స్మశాన వాటికలో పాతిపెట్టబడుతాయి!
కానీ పాతి పెట్టలేనిది
గొప్పగా బతికిన తీరు
వ్యక్తిత్వానికి అంటించుకోని మరకలు మాత్రమే
కొన్ని రోజులు ఇక్కడ ఉంచబడతాయి
ఒకానొక రోజు అవి కూడా చెరచి వేయబడతాయి
కాలం మాత్రమే అన్నింటికీ సమాధానంగా ఉంటూ
మనిషి జన్మకు అర్థాన్ని చెప్పే ప్రయత్నాలు చేస్తుంది
కానీ మనిషి తెలుసుకోకుండా విర్రవీగుతూ
పగలు రాత్రి లెక్కనే సంచరిస్తూ ప్రయాణం చేస్తున్నాడు
అర్దం లేకుండా!
పుట్టుక మరణం మధ్యలో
సాగించే అద్భుతమైన ప్రయాణమే ఈ జీవితం
అందుకే ఏది మనది కానప్పుడు
ఏది మనతో రానప్పుడు
చీకటయ్యే రోజు వరకు అధ్బుతంగా జీవిస్తూ
వీడ్కోలు పలుకుదాం
అవును
గొప్పగా ఈ జీవితానికి వీడ్కోలు పలుకుదాం!
అదొక నిశబ్ద మందిరం
అక్కడెన్నో ఓటములు విజయాలు
ఎన్నో మౌనాలు
ఎన్నో తగాదాలు
ఎన్నో పగలు
ఎన్నో ద్వేషాలు
అర్దం ఉన్నవి
అర్దం లేనివి
అన్ని అక్కడే తలదాచుకున్నాయి
అవును అన్ని అక్కడే తలదాచుకుంటాయి!
నీ వ్యక్తిత్వం పై అంటించుకున్న మరకలు
నువ్వెంత ఉరకలు పెట్టిన
గొప్పవైతే చరిత్ర అవుతుంది
కాకపోతే నీదొక పుట్టుక మరణం అంతే
అర్థంలేని పుట్టుక వ్యర్థమే
అశాశ్వతమైన ఈ జీవన కాలగమనంలో
అస్పష్టంగా ఒకరోజు అన్నీ అక్కడే తలదాచుకుంటాయి!
శ్మశానం అందరినీ హక్కున చేర్చుకుంటూ
అప్పుడప్పుడు భాధలకు సంతోషాలకు ప్రేమలకు కొన్ని విలువలకు అర్థాలను నేర్పిస్తూ
ఆ గొప్ప ప్రదేశంలో ఎన్నో హృదయాలను కంటతడి పెట్టిస్తుంది
మనిషి పుట్టుక మొదలు గిట్టేదాక చేసే ప్రయాణంలో చివరి గమ్యస్థానం శ్మశానం మాత్రమే!
నువ్వు మరణిస్తే
నిన్ను ఒకసారి కూడా చూడని వాడు
నీతో ప్రత్యక్షంగా కలవని వాడు
ఆ మరణవార్త విని కళ్ళనిండా నీళ్ళు తెచ్చుకుని
గుర్తచ్చినప్పుడల్లా వాని హృదయం కలత చెందితే,
నాకు తెలిసి దానికన్నా గొప్ప మరణం ఏదీ ఉండదు
మరణం అనేది
కూటికి లేనోడికైన
ఉన్నోడికైన
ఎవరికైనా అనివార్యమే!
ఎంత గొప్పగా బతికామన్నదే ఇక్కడ సజీవం
అలా కానిదంతా నిర్జీవమే!
సకల చరాచర జగత్తు ఎప్పటికీ గొప్పవాటినే
తనతో పాటు ఉనికిలో ఉంచుకుంటుంది
తనతో పాటే పెంచుకుంటుంది
రాబోయే తరాలకు
సజీవంగా నువ్వు సృష్టించిన చరిత్రను చూపుతుంది
అలా చూపలేనప్పుడు పుట్టుకకు అర్థం లేనట్టే!
మట్టిలో కలిసే మనిషి
ఎందుకు నీకు కపట వేషాలు
ఒంటి నిండా ముళ్ళను ఏర్పరచుకుని
ఎన్నో కట్టు కథలతో నీ జీవితం సాగదీస్తూ బతికేస్తున్నావు?
చివరికి కలిసేది మట్టిలోనే కదా!
నీది కానిది
నీవేవి కానీ వాటికోసం
పడుతూ పరుగెడుతున్నావు
అర్థం లేకుండా!?
ఏది శాశ్వతమో
ఏది అశాశ్వతమో
తెలియకుండా స్వల్పంలో అల్పంగా బతికేస్తున్నావు
ఆలోచనలకే భారంగా
ఆత్మీయతలకు దూరంగా!
జీవితం అల్పమని ఎరిగి
శాశ్వతమైన మనిషి మనుగడ కోసమే బతుకు
నలుగురు గుర్తుచేయాలి
బతికితే నీలాగే బతకాలి అనేలా!
నా ప్రపంచంలోకి
ఏ కల్మషం లేకుండా
వచ్చి
నా హృదయంలోకి ఓసారి తొంగిచూస్తే,
నిర్మలంగా ఆలోచిస్తే తెలుస్తుంది
ఏది గొప్ప జీవితం
ఏది కాదు అని!
మరణం ముందు
అసూయ
కోపం
చెడు వ్యక్తిత్వాలు
ఓర్వలేనితనాలు
ఇంకా ఇలా ఎన్నో
ఓరోజు
అన్ని ఓడిపోతాయి!
చెడు,మంచి అన్ని మట్టిలో పాతిపెడతారు!
చెడు చీకటి అయిపోతుంది
మంచి అనేది వెలుగుతుంది
వెలగడం
వెలగకపోవడం
అది కేవలం
వ్యక్తిత్వం పైనే ఉంటుంది
అంతే
జీవితం!
జీవన ప్రయాణం కొంతవరకే
ఆగిపోతుంది
మనదేది లేకుండా చేస్తూ
మృత్యువు వెంట తీసుకెళ్తుంది
నిన్న,నేడు,రేపు అనేది మన ఆధీనంలో ఉండదు
అలాంటిది ఈ పుట్టుక మరణం ఎంత?
కాలగర్భంలో కలిసిపోక తప్పదు
జీవన గమనం గమ్యం తెలుసుకుని
మృత్యువు అధరాన్ని తాకినప్పుడు
జీవితం స్పష్టం అవుతుంది
అలా తెలుసుకోలేనంత వరకు ఈ పుట్టుక వ్యర్థమే!
కాలప్రవాహంలో గతించే
కిందపడిపోయి చీకటయ్యే
గాలివాటు క్షణాల ముందు
ఇదెంత బతుకు
ఇదెంత బతుకు!
ఏది లేదు
ఏది రాదు
నీకంటూ ఒక మృత్యువు ఉంది
అదే నిజం
అది నీడలా నీ వెంటే వస్తుంది
నీకే తెలియకుండా అది సమీపిస్తుంది!
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు
కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలే
బతికే తీరు మాత్రమే నిజం
ఆ నిజంలోనే బతకాలి
కాలం మనకంటే వేగం
ఈరోజే కాదు
రేపు అనే భవిష్యత్ కూడా
కాలం అనే దోసిళ్ళ నుండి
దొర్లిపోతుంది
అస్పష్టంగా మనకే తెలియకుండా
ఒలికిపోయిన మరకలను అంటించుకుని మరి వెళ్ళిపోతుంది!
నీ కళ్ళల్లో నీళ్ళు తిరగడం
కొన్ని జ్ఞాపకపు తునకలు మిగిలి
కారిపోతున్న ఆ కన్నీళ్ళ సాక్షిగా
ఈ ఒక్కరోజే కాదు
సమాధి చేయబడని నీ భాధ
నువ్వు బ్రతికున్నంత వరకు
నిన్ను బ్రతకనివ్వదు
కానీ నువ్వు బ్రతికే ఉన్నావనే భ్రమలో మాత్రం ఉంచుతుంది!
ఈ శరీరం శాశ్వతం కాదు
ఇది ఎముకల గూడుకి ఒక తొడుగు మాత్రమే
ప్రాణం ఉన్నన్ని రోజులు ఉంటుంది
ప్రాణం పోయాక మట్టిలో కలుస్తుంది
కానీ శాశ్వతంగా నిలిచే బతుకు ఒకటుంది
మనిషి పుట్టుక నుండి మరణం దాకా
మద్యలో సాగించే ప్రయాణమే ఈ జీవితం
జన్మించడం మరణించడం తేలిక
కానీ జీవించడం మాత్రం అంత సులభమేమి కాదు
అది నిరంతర ఘర్షణలతో కూడిన సంఘర్షణ కదా!
( బతికినన్ని రోజులు గొప్ప వ్యక్తులతో గొప్ప ఆలోచనలతో బతకండి అంతేకానీ అశాశ్వమైన ఆలోచనలతో బతుకుతూ ఎలాంటి గొప్ప సందేశం ఇవ్వలేరు. బతికితే చరిత్ర తన కడుపులో దాచుకోవాలి. ఇక జన్మించడం - జీవించడం - మరణించడం తెలియని వాళ్లకు ఎన్ని గొప్ప సందేశాలు ఇచ్చిన వ్యర్థమే. బంధాలకు విలువలను ఇస్తూ ఆదర్శంగా బతకడమే ఈ బలగం యొక్క బలం)
- Sathish Gaddam అన్న రాసిన కథా మూలం ఈ మూవీలో ఉంది. ఈ మూవీ చూడకముందే ఆ కథను చదివాను. సరే ఏదేమైనా కానీ సతీష్ అన్నకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే బాగుండు అనిపించింది. చివరిగా ఈ బలగం మూవీ లో నటించిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు. చాలా గొప్పగా కళ్ళకు కట్టినట్లు వాస్తవాలను చూపించి తెలంగాణ యాస బాసను నలుదిశలా చాటారు.
Kamareddy
9963691692
Comments
Post a Comment